Telangana: ‘తెలంగాణ’ను ఉమెన్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • లలిత కళా తోరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
  • ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ‘వి-హబ్’ : తుమ్మల 
  • ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలి : నాయిని

తెలంగాణ రాష్ట్రాన్ని మహిళలకు సురక్షితమైన ఉమెన్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాదు లోని లలిత కళా తోరణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, విశిష్ట మహిళా పురస్కార ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే హైదరాబాదులో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ’వి-హబ్’ను ఏర్పాటు చేశామని, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా ఉచితంగా ఆంగ్ల విద్యను, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ఒక పూట పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, ‘షీ’  టీమ్స్ ఏర్పాటు ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని అన్నారు.  
అనంతరం, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు భరోసాగా 200  షీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని, 730 మహిళా కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు. ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించి, ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా వారిని తల్లి దండ్రులు ప్రోత్సహించాలని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన  తెలంగాణ శాసనసభ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, చట్ట సభలలో మహిళలకు ప్రాతినిధ్యం పెంచేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని అన్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి వివాహం అయ్యే వరకు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని, అందుకే ‘ఆరోగ్య లక్ష్మి’, ‘ఉచిత విద్య’, ‘కళ్యాణ లక్ష్మి’ తదితర పథకాలను అమలు చేస్తోందని అన్నారు. అనంతరం 17 రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు పురస్కారాలను అందజేశారు.  

  • Loading...

More Telugu News