Mehul choksi: సీబీఐకి పీఎన్‌బీ మోసగాడు చోక్సీ ఘాటు లేఖ...!
- భారత్‌కు తన వల్ల ఎలాంటి ముప్పని సూటిప్రశ్న
- ఆరోగ్యం సరిగా లేనందు వల్ల భారత్‌కు రాలేను
- పాస్ పోర్టు రద్దుకు మీడియా ప్రచారమూ కారణమే
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ని మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల్లో ఒకరైన గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మేహుల్ చోక్సీ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఘాటు పదజాలంతో ఓ లేఖ రాశారు. తన పాస్ పోర్టును రద్దు చేయడం తన హక్కులను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు.
పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేశారో ముంబై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్‌పీఓ) ఇంతవరకు వివరణ ఇవ్వలేదని, భారత్‌కు తాను ఏ విధంగా భద్రతా పరమైన ముప్పో చెప్పాలని ఆయన తన లేఖలో సూటిగా ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా మీడియా ప్రచారం చేస్తుండటం కూడా తన పాస్ పోర్టు రద్దుకు కారణమని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగాలేదని, ఒకవేళ తాను అరెస్టయితే తగు చికిత్సను పొందలేమోనని తాను ఆందోళన చెందుతున్నట్లు చోక్సీ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి కూడా తనకు అనుమతి లభించకపోవచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందువల్ల తాను ఇప్పుడు భారత్‌కు రాలేని పరిస్థితి నెలకొందని ఆయన అంటున్నారు.
కాగా, ఈ స్కాం వెలుగు చూడటానికి ముందే అంటే, జనవరి మొదట్లోనే నీరవ్ మోదీ, ఆయన కుటుంబం, మామ చోక్సీ దేశం విడిచిపారిపోయారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్‌లలో నీరవ్ మోదీ పేరును చేర్చారు.