Dawood: దావూద్ విషయంలో రాజ్ థాక్రే ఆరోపణలే నిజమవుతున్నాయా?
- కేంద్రంతో సెటిల్‌మెంట్‌కు దావూద్ ప్రయత్నాలని ఆరోపణ
- దావూద్ అనుచరుడు తక్లాని టాడా కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు
- ముంబై ఆర్థర్ జైలులో ఉంచుతానంటేనే లొంగుతానంటూ దావూద్ షరతు
ముంబై పేలుళ్ల కేసు-1993 ప్రధాన సూత్రధారి, చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం భారతదేశానికి తిరిగి రావడానికి కేంద్ర ప్రభుత్వంతో 'సెటిల్‌మెంట్'కు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే కొన్ని నెలల కిందట చేసిన ఆరోపణలే ఇప్పుడు నిజమవుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం క్షీణించిపోయినందున దావూద్ తన చివరి క్షణాలను భారత్‌లో గడపాలని కోరుకుంటున్నాడని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు దావూద్ కూడా ఇటీవల ముంబైలోని ఆర్థర్ రోడ్డు కేంద్ర కారాగారంలో తనను ఉంచుతానంటేనే లొంగిపోతానంటూ భారత ప్రభుత్వానికి షరతు విధించాడు.
ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే...రాజ్ థాక్రే చేసిన ఆరోపణలే నిజమవుతున్నాయనే భావన కలుగుతోంది. ఇదే కేసులో భారతదేశం విడిచిపెట్టి దుబాయి పారిపోయిన దావూద్ అనుచరుడు ఫరూఖ్ తక్లాని సీబీఐ ఈ రోజు న్యూఢిల్లీలో అరెస్టు చేసిందని, ప్రస్తుతం అతన్ని విచారిస్తోందని, మరికొన్ని గంటల్లో అతన్ని ముంబై టాడా కోర్టులో ప్రవేశపెట్టనుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఇది తప్పకుండా దావూద్ గ్యాంగ్‌కు భారీ కుదుపు అవుతుందని సీనియర్ అడ్వొకేట్ ఉజ్వల్ నిగం అంటున్నారు. "ఇది భారీ విజయం. అతను (తక్లా) 1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు" అని ఆయన అన్నారు. ఈ వారం మొదట్లో క్రిమినల్ లాయర్ శ్యామ్ కేశ్వానీ మాట్లాడుతూ...కొన్ని ముందస్తు షరతులతో దావూద్ తిరిగి భారత్ రావడానికి ఆసక్తిగా ఉన్నాడని, కానీ ఈ షరతులు భారత ప్రభుత్వానికి సమ్మతమైనవి కావని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.