Jagan: చంద్రబాబుకు నా సలహా ఇదొక్కటే... దయచేసి వినండి!: వైఎస్ జగన్
- 21న వైకాపా అవిశ్వాసం
- చంద్రబాబు సహకరించాలి
- లేకుంటే టీడీపీ అవిశ్వాసం పెడితే మేం వెంట నిలుస్తాం
- మీడియాతో వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాసం పెట్టడానికి తాము నిర్ణయించామని, అవిశ్వాసానికి చంద్రబాబునాయుడు సహకరించాలని వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబుకు ఆలోచించుకునే సమయం ఇవ్వడానికే 21 వరకూ గడువు ఇస్తున్నామని, రాష్ట్రం మొత్తం ఒకతాటిపై నిలబడి 25 మంది ఎంపీలూ అవిశ్వాసానికి మద్దతుగా నిలిస్తే, కేంద్రానికి ఓ సంకేతం వెళుతుందని, మరింత ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.
చంద్రబాబు ఓకే అంటే, అంతకన్నా ముందైనా అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. "నన్ను పెట్టమంటే నే పెడతా. 25కి 25 మంది ఎంపీలూ ఒకతాటిపై నిలబడదాం. అవిశ్వాసం పెడదాం. మేం అవిశ్వాసం పెడతాం నువ్వు మద్దతివ్వు. లేదంటే నువ్వు పెట్టు మేం ఇస్తాం. దాని తరువాత 25 మంది ఎంపీలతోనూ మూకుమ్మడిగా రాజీనామా చేయిద్దాం. అప్పుడు దేశమంతా చర్చ జరుగుతుంది. ఎందుకు ఆంధ్రరాష్ట్రం ఇలా చేస్తోందని ఆలోచిస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు. చంద్రబాబుకు నా సలహా ఇదొక్కటే" అని అన్నారు. తన సలహాను ఆయన వినాలని కోరారు.