Arun Jaitly: అరుణ్ జైట్లీ ఎన్నడూ మాట మార్చలేదు, మాట మార్చింది చంద్రబాబే... ఇది ప్రజా విజయం!: జగన్
- జైట్లీ ఎన్నడూ మాట మార్చలేదు
- ఆయన ఆది నుంచి చెబుతున్నది ఒకటే
- ఇప్పుడు మాటా మార్చింది చంద్రబాబే
- మీడియాతో వైఎస్ జగన్
అరుణ్ జైట్లీ తన మాటలను ఎన్నడూ మార్చలేదని, ఆయన మొదటి నుంచి ఒకటే చెబుతూ వచ్చారని వ్యాఖ్యానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, జైట్లీ మాటలపై నాడు ఒకలా, నేడు మరోలా చంద్రబాబు స్పందించారని, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయిన చంద్రబాబు, ఇప్పుడిలా నిర్ణయం తీసుకుని ప్రజలను మరోసారి మభ్యపెట్టే పనిలో నిమగ్నమయ్యారని నిప్పులు చెరిగారు.
ఈ ఉదయం ప్రకాశం జిల్లా సంతరావూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, "ఈ రోజు అరుణ్ జైట్లీ గారి స్టేట్ మెంట్ నేపథ్యం, దాని తరువాత చంద్రబాబునాయుడి రియాక్షన్స్ నేపథ్యంలో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. నిజంగా ఒక్కసారి ఈ పరిణామాలన్నీ చూస్తే, జైట్లీ స్టేట్ మెంట్... నిన్న ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ కొత్తది కాదు. సెప్టెంబర్ 8, 2016 అనుకుంటా... మై మెమరీ గోస్ రైట్. ఇదే మాట మాట్లాడారనుకుంటా.
ఆ రోజు చంద్రబాబు, జైట్లీ మాట్లాడితే, అర్థరాత్రి పూటే చంద్రబాబు మేలుకుని దాన్ని స్వాగతించారు. ఆపై వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలకు శాలువాలు కప్పారు. ఇవన్నీ గతం. అసెంబ్లీలో చంద్రబాబునాయుడు దీని గురించి విపరీతంగా పొగడుతూ... ఆనాడు ఆయన అన్న మాటలు... ప్రత్యేక హోదా ముగిసిపోయిన ఘట్టం. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని ఆయన అన్న మాటలు, హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు ఏం మేలు జరిగిందని అడిగిన ప్రశ్నలు... ఆరోజు అసెంబ్లీలో మనమంతా చూశాం"
"ఈరోజు అవే మాటలు అరుణ్ జైట్లీ నోటి నుంచి మళ్లీ వస్తే, అవేవో కొత్తగా వచ్చినట్టుగా రియాక్ట్ అయిపోయి... ఓహోహోహో ఏదో జరిగింది. ఏదో చెప్పినాడు అని చంద్రబాబు ఓవర్ గా రియాక్ట్ అయిపోయి, యూటర్న్ తీసుకొని, తన మంత్రులను కేంద్ర కేబినెట్ నుంచి ఉపసంహరించుకుంటానని చెబుతూ ఉంటే... నిజంగా చంద్రబాబునాయుడిని, ఆయన మాటలను చూసినప్పుడు... ఆరోజు ఆ మాదిరిగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు? ఈరోజు ఈ మాదిరిగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు?... దీనికి కారణం ఏంటంటే ఇది ప్రజల విక్టరీ.
ప్రజల నుంచి ఒత్తిడి వస్తూ ఉంటే, ఎన్నికలు జరగబోతాయన్న నేపథ్యంలో, ప్రజల్లో తీవ్రంగా ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష బయట పడుతూ ఉన్న నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేస్తామని చెప్పి అల్టిమేట్టం ఇచ్చిన నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం మార్చి 21న పెడతామని డేట్ ఇచ్చిన నేపథ్యంలో, ప్రజల ఆకాంక్షలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్న నేపథ్యంలో... ప్రజల విక్టరీ ఇది. ఆయన తలఒగ్గాల్సి వచ్చింది" అని గుర్తు చేశారు.