Chandrababu: నేను వేసింది తొలి అడుగే... ముందు ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు: చంద్రబాబు
- వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదు
- ప్రస్తుతం ఎన్డీయేలో మాత్రం కొనసాగుతాం
- సానుకూల నిర్ణయాలు తీసుకుంటారన్న ఉద్దేశంతోనే
- ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు
కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగడం తొలి అడుగు మాత్రమేనన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ముందుముందు మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన, నిన్న రాత్రి 10.30 గంటల తరువాత ప్రత్యేక మీడియా సమావేశంలో ఎన్డీయే సర్కారు నుంచి తమ మంత్రులు రాజీనామా చేస్తారని, ప్రస్తుతానికి కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగే టీడీపీ, ఎన్డీయేలో మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు.
సంయమనం పాటిస్తూ ప్రయోజనాలను సాధించుకోవాలన్నది తన అభిమతమని, కేంద్రంపై మరింత ఒత్తిడి పెడుతూనే, సానుకూల నిర్ణయాలు వెలువడితే కలిసుంటామని చెప్పడానికే ప్రస్తుతానికి ఎన్డీయేలో ఉండాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఏం ప్రయోజనాలు ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతోందో తనకు తెలుసునని, ఏ ఉద్దేశంతో వారు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారో వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డ ఆయన, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నిజాలే చూపించాలని కోరారు.