karnataka: కర్ణాటక లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ్ షెట్టిపై దాడి... కత్తిపోట్లు!
- బెంగళూరులోని లోకాయుక్త ఆఫీసులో సంఘటన
- విశ్వనాథ్ షెట్టిపై మూడుసార్లు కత్తితో పొడిచిన వైనం
- గాయపడ్డ విశ్వనాథ్ షెట్టి ఆసుపత్రికి తరలింపు
- పోలీసుల అదుపులో నిందితుడు
కర్ణాటక రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ్ షెట్టిపై ఆయన కార్యాలయంలోనే హత్యాయత్నం జరిగింది. బెంగళూరులోని లోకాయుక్త ఆఫీసులో ఈ రోజు ఈ సంఘటన జరిగింది. ఫిర్యాదుదారుడు తేజస్ శర్మ తన వెంట తెచ్చుకున్న కత్తితో విశ్వనాథ్ షెట్టిని మూడుసార్లు పొడిచాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బందిని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గాయపడ్డ విశ్వనాథ్ షెట్టిని మల్లయ్య ఆసుపత్రికి తరలించ చికిత్స అందించారు. ఈ విషయాన్ని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ విశ్వనాథ్ శెట్టిని ఆసుపత్రికి తరలించామని, కర్ణాటక సీఎం సిద్ద రామయ్య నేరుగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినట్టు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే కోపంతో జస్టిస్ విశ్వనాథ్ షెట్టిపై తేజస్ శర్మ కత్తితో దాడికి పాల్పడ్డాడని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తేజస్ శర్మ తుముకూరు ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టరని, టెండర్ల వివాదంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడని, అనంతరం ఈ దాడికి పాల్పడినట్టు పోలీసుల సమాచారం.
కాగా, లోకాయుక్త కార్యాలయంలో పలు చోట్ల సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్, భద్రతా సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ, ఈ సంఘటన చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, విశ్వనాథ్ షెట్టి గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. అనంతరం, 2017 జనవరిలో కర్ణాటక లోకాయుక్తగా నియమించారు.