MP Siva Prasad: మీ నీరు, మీ మట్టిని మీరే తీసుకోండి: కావడి మోస్తూ ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
- కావడితో పార్లమెంట్ కు వచ్చిన చిత్తూరు ఎంపీ
- స్పీకర్ కు ఇచ్చి ప్రధానికి పంపాలని వినతి
- మూడో రోజూ కొనసాగుతున్న నిరసనలు
నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెబుతూ, ప్రధాని ముంతడు నీటిని, మట్టిని నోట్లో కొట్టి పోయారని ఆరోపిస్తూ, ఆయన ఇచ్చిన నీటిని, మట్టిని ఆయనకే ఇచ్చేస్తామని చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ ఈ ఉదయం పార్లమెంట్ లో వినూత్న నిరసన తెలిపారు. పవిత్ర మట్టి, పవిత్ర నీరు అంటూ ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించిన ఆయన, నీరు, మట్టితో నిండిన కావడిని మోసుకుంటూ పార్లమెంటుకు వచ్చారు. వీటిని స్పీకర్ కి ఇచ్చి, ఆమె ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి పంపించాలని కోరనున్నట్టు తెలిపారు.
కాగా, ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషం వేస్తూ, తనదైన శైలిలో నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, బడ్జెట్ మలివిడత సమావేశాల మూడో రోజూ పార్లమెంట్ లో హోదా రభస కొనసాగింది. లోక్ సభ ప్రారంభం కాగానే బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీల సభ్యులూ వెల్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడగా స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.