Andhra Pradesh: తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లను దాటనున్న ఏపీ బడ్జెట్!

  • ఎన్నికల సంవత్సరంలో భారీగా తాయిలాలు
  • పలు పథకాలకు మరిన్ని నిధులు
  • సంక్షేమానికి పెద్దపీట వేయనున్న యనమల
  • నిరుద్యోగ భృతికి నిధులు ఇచ్చే చాన్స్
  • ఎస్సీ, ఎస్టీలకు ప్రాధానం ఇవ్వనున్న సర్కారు

ఆంధ్రప్రదేశ్ 2018-19 వార్షిక బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల మార్క్ ను తొలిసారిగా అధిగమించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం తొలి ఏడాది రూ. 1.11 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఆపై క్రమేణా ఏటికేడూ పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గురువారం నాడు (రేపు) బడ్జెట్ ను శాసనసభ, మండలి ముందుకు తేనుండగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. ఎన్నికలు ముందస్తుగా జరిగితే, ఈ బడ్జెట్ చివరిదవుతుంది. ఒకవేళ వచ్చే సంవత్సరం మే నెలలోనే ఎన్నికలు జరిగితే, మార్చిలో తాత్కాలిక బడ్జెట్ ను తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి.

ఎన్నికల సంవత్సరం కాబట్టి, ప్రజలకు పలు తాయిలాలతో పాటు, సంక్షేమానికి నిధుల కోటాను మరింతగా పెంచుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఉపాధి కార్యక్రమాలు, వివిధ రకాల పింఛన్లు, సాగునీటి కార్యక్రమాలకు పెద్దమొత్తంలో నిధులు దక్కే చాన్స్ కనిపిస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతికి కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగులకు నెలవారీ భృతి కల్పించి, వారిని సామాజిక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో సామాజిక పింఛన్లకు ఇచ్చే కేటాయింపులను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కూడా అధిక కేటాయింపులను దక్కించుకోనుంది. ఒక్క జలవనరుల శాఖకే రూ. 24 వేల కోట్లను కేటాయించే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు రూ. 13 వేల కోట్లను ఖర్చు పెట్టి, ఆపై కేంద్రం నుంచి తిరిగి రాబట్టు కోవాలన్నది చంద్రబాబు సర్కారు ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News