China: కూలిన విమానాశ్రయం సీలింగ్...ఆందోళనకు గురైన ప్రయాణికులు.. వీడియో చూడండి!
- ప్రయాణికుల కళ్ల ముందే కూలిన విమానాశ్రయం సీలింగ్
- గాలి తీవ్రతకు ఊడిపడిన సీలింగ్ డిజైన్
- వాహనాలపై పడిన సీలింగ్ భాగాలు
కళ్లముందే విమానాశ్రయం పైకప్పు కూలడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తూర్పు చైనాలోని జియాంగ్జు ప్రావిన్స్ లోని ప్రధాన విమానాశ్రయమైన నాన్ చాంగ్ చాంగ్ బీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో అక్కడ వీచిన గాలుల తీవ్రతకు విమానాశ్రయం ప్రవేశద్వారం వద్ద డిజైన్ కోసం ఏర్పాటు చేసిన సీలింగ్ ప్యానల్స్ కుప్పకూలిపోయాయి.
దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనను పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, అటుగా వెళ్తున్న వాహనాలపై ఆ సీలింగ్ భాగాలు పడ్డాయి. అయినప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.