srilanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నేటి మ్యాచ్ పై బీసీసీఐ స్పందన
- శ్రీలంకలో మత కలహాలు
- 10 రోజుల పాటు ఎమర్జెన్సీ
- మ్యాచ్ జరుగుతుందని ప్రకటించిన బీసీసీఐ
సెంట్రల్ శ్రీలంకలో చెలరేగిన మత కలహాలు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో... శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. ఈ సాయంత్రం శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న ముక్కోణపు సిరీస్ ప్రారంభమవుతోంది. సరిగ్గా ఈ రోజే ఎమర్జెన్సీని విధించడంతో.. టోర్నీ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి తోడు టీమిండియా ఆటగాళ్ల భద్రతపై కలవరపాటు ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో, బీసీసీఐ ఓ నోట్ ను విడుదల చేసింది. అల్లర్లు క్యాండీలో జరిగాయని.. నేడు మ్యాచ్ జరుగుతున్న కొలంబోలో కాదని నోట్ లో పేర్కొంది. అక్కడి అధికారులతో సంప్రదించి, పరిస్థితులన్నీ అదుపులో ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకున్నామని తెలిపింది. ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పిస్తున్నట్టు వారు తెలిపారని... ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ జరిగి తీరుతుందని వెల్లడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుంది.