Kerala: కడుపునిండా తింటే చాలు....బిల్లు ఇవ్వకున్నా ఎవరూ అడగరు!
- ఉచిత హోటల్ ను ప్రారంభించిన స్నేహజలకం స్వచ్ఛంద సంస్థ
- కేరళలోని అళపళ ప్రాంతంలోని పాతిరాపల్లిలో ఏర్పాటు
- తిన్న తరువాత ఎంత ఇస్తే అంత తీసుకుంటారు
‘అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్న’ అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ, కేరళలోని అళపళ ప్రాంతంలోని పాతిరాపల్లిలో ‘పీపుల్స్ రెస్టారంట్’ ను ‘స్నేహజలకం’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ఆదివారం ఈ హోటల్ ను కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇజాక్ ప్రారంభించారు. ఈ హోటల్ లో భోజనం చేసిన తరువాత బిల్లు తీసుకునేందుకు క్యాషియర్ ఉండరు. తిన్నదానికి ఎవరూ డబ్బులడగరు. తినేసిన తరువాత ఇవ్వాలనిపించినంత ఇస్తే చాలు. లేదు ఇవ్వం అని అనుకున్నా ఎవరూ డబ్బులడగరు.
ఆకలి తీర్చాలన్న సదాశయంతో ఈ హోటల్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఉచిత హోటల్ ఇదేనని థామస్ ఇజాక్ అన్నారు. అలాగని ఇదేదో చిన్నపాటి హోటల్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే 2,000 మందికి అవసరమైన ఆహారపదార్థాలను అందించగల అధునాతన వంటశాల ఈ హోటల్ సొంతం. ప్రతి రోజూ వెయ్యి మందికి ఆహారపదార్థాలను తయారు చేస్తారు. వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, నీటి శుద్ధీకరణ కేంద్రం ఈ హోటల్ కి అనుబంధంగా ఉండడం విశేషం. ఈ హోటల్ కోసం బిల్డింగ్ ను కూడా దాతలే కట్టించారు. ఈ హోటల్ నిర్వహణకు అవసరమైన కూరగాయలను 2.5 ఎకరాల్లో పండిస్తున్నారు. అందులో పండిన వాటిని వినియోగిస్తున్నారు.