AK 47: జవాన్ వీరోచిత పోరాటం... పలాయనం చిత్తగించిన మావోలు!
- జవాన్ ఏకే-47ని ఎత్తుకుపోయేందుకు మావోల విఫలయత్నం
- వట్టిచేతులతో పారిపోయేలా చేసిన జవాన్
- ఆయనపై పోలీసు అధికారుల ప్రశంసలు
ఓ జవాన్ వీరోచిత పోరాటంతో మావోలు పలాయనం చిత్తగించారు. వివరాల్లోకెళితే, 33 ఏళ్ల గోంజీ మట్టామి గడ్చిరోలి ప్రధాన కార్యాలయంలో 2006 నుంచి జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన పలు ఎన్కౌంటర్లలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆదివారం నాడు కూడా తన ధైర్యసాహసాలను మరోసారి ప్రదర్శించాడు. గడ్చిరోలిలోని ఈతపల్లి తాలూకా, జాంబియా గట్టలో రద్దీగా ఉన్న మార్కెట్లో ఓ యాక్షన్ టీమ్‌కి చెందిన నలుగురు మావోయిస్టులతో అతను పోరాడాడు. తన ఏకే-47 రైఫిల్‌ను, మేగజైన్లను ఎత్తుకెళ్లిపోవడానికి వారు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు. ఈ ప్రయత్నంలో తన ఛాతీపై వారు చేసిన గాయాన్ని సైతం ఆయన లక్ష్యపెట్టలేదు. వారితో వట్టి చేతులతోనే పోరాడి ఔరా అనిపించుకున్నాడు.
రద్దీ మార్కెట్లో వారిపై తన రైఫిల్‌తో కాల్పులు జరుపుతూ ఆయన చేసిన పోరాటం అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు మావోయిస్టులే భయపడి పారిపోయేలా చేశాడు. పోలీసు శాఖ అంతటా ఇప్పుడు మట్టామి వీరోచిత పోరాటాల గురించే చర్చించుకుంటున్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలకు వచ్చే ఏడాది ప్రభుత్వం అతనికి అవార్డును బహూకరించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. మట్టామి ప్రస్తుతం ఆరెంజ్ సిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఓసీహెచ్‌ఆర్ఐ)లో చికిత్స పొందుతున్నాడు. ఛాతీకి గాయమైనప్పటికీ ఆయన హుషారుగా పలకరిస్తుండటం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.