Tripura: త్రిపురలో గెలవగానే లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిన బీజేపీ శ్రేణులు... వీడియో చూడండి!
- త్రిపుర ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కూటమి
- పాతికేళ్ల తరువాత అధికారానికి దూరమైన వామపక్షాలు
- లెనిన్ విగ్రహం కూల్చివేతపై విమర్శలు
- మాణిక్ రాజీనామా చేసిన మర్నాడే ఘటన
ఈశాన్యాన త్రిపురలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న మాణిక్ సర్కారును గద్దె దించామన్న ఆనందంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. తాజాగా విడుదలైన ఓ వీడియో ఇప్పుడు సంచలనమైంది. బెలోనియా కాలేజ్ లో ఉన్న ప్రపంచ వామపక్ష నేత వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని ఓ బుల్డోజర్ సాయంతో కూల్చేశారు. మాణిక్ సర్కారు సీఎం పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర)తో కలసి 59 అసెంబ్లీ స్థానాలకుగాను 43 స్థానాలను బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ట్రైబల్స్ కు రిజర్వ్ చేసిన 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్నింటినీ ఈ కూటమి గెలుచుకోవడం గమనార్హం. అధికార సీపీఎం 15 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. లెనిన్ విగ్రహం కూల్చివేతపై వామపక్ష సంఘాలు మండిపడ్డాయి. బీజేపీ మార్క్ పాలన అప్పుడే మొదలైందని విమర్శించాయి. లెనిన్ విగ్రహాన్ని కూల్చుతున్న దృశ్యాలను వార్తాసంస్థ 'ఏఎన్ఐ' వెలుగులోకి తెచ్చింది. దాన్ని మీరూ చూడవచ్చు.