Yasin Bhatkal: తనకు ఎంతో సిగ్గని, వీడియో కెమెరా వద్దని అంటున్న ఉరిశిక్ష పడ్డ ఉగ్రవాది!
- నాకు కెమెరా షై ఉంది
- ముఖంపై వీడియో కెమెరా పెట్టవద్దు
- ఢిల్లీ కోర్టుకు యాసిన్ భత్కల్ వినతి
- విచారణ ఆలస్యం చేసేందుకే ఈ ప్లాన్!
తనకు వీడియో కెమెరాలంటే ఎంతో సిగ్గని, కెమెరా షై ఉన్న తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించ వద్దని 2013 దిల్ సుఖ్ నగర్ పేలుళ్లలో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఢిల్లీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైదరాబాద్ తో పాటు పుణె, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు నగరాల్లో సైతం విధ్వంసాలకు పాల్పడిన భత్కల్, దేశవ్యాప్తంగా 149 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్ర కార్యకలాపాల సూత్రధారి. కాగా, ఇక తనను వీడియో కాన్ఫరెనర్స్ ద్వారా విచారించే ప్రక్రియను నిలిపివేయాలని భత్కల్ కోరగా, కేసు విచారణను ఆలస్యం చేసేందుకే భత్కల్ ఇటువంటి ప్లాన్ వేస్తున్నాడని నిఘా వర్గాలు అంటున్నాయి.
2013లోనే యాసిన్, అతని బంధువులు రియాజ్ ఇక్బాల్ పట్టుబడగా, విచారణ జరిపిన కోర్టు గత సంవత్సరం ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పేలుళ్ల కేసులో సైతం యాసిన్ భత్కల్ నిందితుడిగా ఉండటంతో, అతన్ని ఢిల్లీ తీసుకెళ్లి, తీహార్ జైల్లోని సోలిటరీ కన్ఫైన్ మెంట్ (ఏకాంత కారాగారం)లో ఉంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసును బెంగళూరు కోర్టు విచారిస్తుండగా, ఈ ఉగ్రవాదికి ఎక్కడలేని సిగ్గూ పుట్టుకొచ్చింది.