Conrad Sangma: ప్రభుత్వ ఏర్పాటుకు ముందే మేఘాలయలో సంక్షోభం.. కూటమిలో బీజేపీ ఉండడంపై హెచ్ఎస్పీడీపీ అభ్యంతరం
- నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కాన్రాడ్ సంగ్మా
- కూటమిలో బీజేపీ ఉండడంపై హెచ్ఎస్పీడీపీ అభ్యంతరం
- బయటకు వస్తే సంగ్మాకు తిప్పలే
మేఘాలయలో నేడు ప్రభుత్వ ఏర్పాటుకు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ సంగ్మా సిద్ధమవుతుండగా అంతలోనే హైడ్రామా నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం లేకపోయింది. రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ పావులు కదిపి మిత్రపక్షాలతో కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంది. దీంతో 19 మంది సభ్యులున్న ఎన్పీపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంగ్మా ఉద్యుక్తులవుతుండగా హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని కోరుకున్నామని, కాబట్టి ప్రాంతీయ పార్టీలతోనే ప్రభుత్వం ఏర్పడాలని మెలిక పెట్టింది. దీంతో సంగ్మాకు కొత్త సమస్య ఎదురైంది.
ఇటీవలి ఎన్నికల్లో హెచ్ఎస్పీడీపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న యూడీపీకి ఆరు సీట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 59 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 30 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఎన్పీపీ 19 సీట్లు గెలుచుకోగా, బీజేపీ (2), యూడీపీ (6), పీడీఎఫ్ (4), హెచ్ఎస్పీడీపీ (2), స్వతంత్ర అభ్యర్థి ఒకరు మద్దతు ఇస్తున్నారు. దీంతో వారి ఎన్పీపీ బలం 34కు చేరుకుంది. అయితే ఇప్పుడు హెచ్ఎస్పీడీపీ అభ్యంతరంతో సంగ్మాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆరు సీట్లున్న యూడీపీ.. హెచ్ఎస్పీడీపీతో కలిసి బయటకు వస్తే సంగ్మా ప్రమాణ స్వీకారం కలగానే మిగిలిపోతుంది.