south africa: హద్దులు మీరిన స్లెడ్జింగ్.. బంతితో కసితీర్చుకున్న లియాన్... క్షమాపణలు!
- డర్బన్ వేదికగా తొలి టెస్టు
- తొలి టెస్టు గెలుచుకున్న ఆసీస్
- డివిలీర్స్ ఛాతిపై బంతితో కొట్టిన లియాన్
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆసీస్ మధ్య జరిగిన మొదటి టెస్టులో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఈ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. స్లెడ్జింగ్ ఆటలో భాగమని పేర్కొనే ఆసీస్ ఆటగాళ్లు ఈ టెస్టులో పరిధులు దాటారు. డేవిడ్ వార్నర్ సఫారీ కీపర్ క్వింటన్ డీకాక్ తో వాగ్వాదానికి దిగగా, ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ త్రో నెపంతో సఫారీ ఆటగాడిని బంతితో కొట్టిన ఘటన చోటు చేసుకుంది.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో లియాన్ వేసిన 12వ ఓవర్లో మార్ క్రమ్ బంతిని బీట్ చేశాడు. దీంతో పరుగుకోసం మార్ క్రమ్, డివిలియర్స్ ఇద్దరూ ముందుకు వచ్చారు. వెంటనే బంతిని వార్నర్ అందుకోవడంతో పరుగు వద్దంటూ మార్ క్రమ్ వారించాడు. దీంతో వెనక్కి మళ్లిన డివిలియర్స్ ను నాథన్ లియాన్ స్టంప్ అవుట్ చేశాడు. ఆ ఆనందంలో లియాన్ బంతితో డివిలియర్స్ ఛాతిపై కొట్టాడు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. దీంతో తప్పు అంగీకరించిన లియాన్ క్షమాపణలు కోరాడు. దీంతో ఐసీసీ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. కాగా, తొలి టెస్టులో ఆసీస్ 118 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.