lalu daughter: లాలూ కుమార్తె, అల్లుడికి ఊరట... బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు
- దేశం విడిచి వెళ్లరాదని షరతు
- 2008-09 నాటి ఫార్మ్ హౌస్ కొనుగోలు కేసు
- రూ.1.2 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగినట్టు ఈడీ ఆరోపణ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్ కు కొంచెం ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో వీరికి ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల రాదన్న షరతు విధించింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ గత డిసెంబర్ 23న కోర్టులో మీసా భారతి, శైలేష్ కుమార్ కు వ్యతిరేకంగా తుది నివేదిక దాఖలు చేసింది.
షెల్ సంస్థల ద్వారా ఈ దంపతులు 1.2 కోట్ల మేర అక్రమంగా నగదు చలామణికి కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపణ. ఢిల్లీలో మీసా భారతి, ఆమె భర్త కలసి తమ కంపెనీ మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట కొనుగోలు చేసిన ఫార్మ్ హౌస్ కు సంబంధించిన కేసు ఇది. 2008-09లో జరిగిన ఈ లావాదేవీ రూపంలో రూ.1.2 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది.