china: చైనాకు ప్రధాని మోదీ... భారత్ కు చైనా అధ్యక్షుడు... ఈ ఏడాది అగ్రనేతల పర్యటనలు
- జూన్ లో చైనాకు ప్రధాని మోదీ
- షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరు
- ఆ తర్వాత భారత్ కు రానున్న జిన్ పింగ్
చైనా కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత నేత, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ఈ ఏడాది భారత్ లో పర్యటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన రాక కంటే ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. దీంతో అరుదైన పర్యటనలకు ఈ ఏడాది వేదికగా నిలవనుంది. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ ఈ ఏడాది జూన్ లో చైనా పర్యటనకు వెళ్లనున్నారు.
దీంతో 2015 నుంచి ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం నాలుగో సారి అవుతుంది. అలాగే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ ఏడాది భారత్ లో పర్యటించనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల సమాచారం. రానున్న నెలల్లో ఇరు దేశాల మధ్య అధికారుల స్థాయిలోనూ చర్చలు జరగనున్నాయి. చైనా విదేశీ వ్యవహారాల మంత్రి యాంగ్ఈ కూడా రానున్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకునే ప్రయత్నాలు కొనసాగనున్నాయి.