Andhra Pradesh: ఇక పోలీసులు కనబడరు... పోలీసింగ్ మాత్రం ఉంటుంది: గవర్నర్ నరసింహన్

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం
  • పోలీసు శాఖలో సంస్కరణలు
  • ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం
  • రాష్ట్రాభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులు: నరసింహన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పోలీసులు కనబడకుండా, పోలీసింగ్ కనబడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల యంత్రాంగాన్ని మరింతగా పటిష్ఠం చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన సమస్యను నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెప్పుకోవచ్చని అన్నారు.

పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడి, ప్రోత్సాహకాలకు వీలు కల్పించేలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించిన ఆయన, ఎకో హెరిటేజ్, బీచ్ టూరిజం విభాగాల్లో ఆధునిక సదుపాయాలతో కొత్త ప్రాజెక్టులు రానున్నాయని వెల్లడించారు. కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా సమూల మార్పును చూడనుందని, భవిష్యత్తులో ఆ ప్రాంతం ఆటోమొబైల్ కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అన్నారు. ఎలక్ట్రానిక్ హబ్ గా చిత్తూరు, తిరుపతి అభివృద్ధి చెందుతున్నాయని, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల హబ్ గా విశాఖపట్నం ప్రాంతాలు, జౌళి, ఆహార శుద్ధి కేంద్రాలుగా గుంటూరు, కృష్ణా జిల్లాలు ప్రగతిపథంలో సాగుతున్నాయని అన్నారు. కర్నూలులో ఒక అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ రానుందని తెలిపారు.

వివిధ సదస్సులను విజయవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఇప్పటివరకూ రూ. 13.54 లక్షల కోట్లు అంగీకరించిన పెట్టుబడితో, 31 లక్షల మందికి ఉపాధిని కల్పించేలా కొత్త పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. 18 విభాగాలకు చెందిన 1946 భారీ, మెగా ప్రాజెక్టులను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి తన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుందని వెల్లడించారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు వారికి నాణ్యమైన శిక్షణను ఇచ్చే ఏర్పాట్లు చేశామని అన్నారు.

  • Loading...

More Telugu News