farooq abdullah: దేశం విడిపోవడానికి కారణం మహ్మద్ అలీ జిన్నా కాదు!: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

  • దేశ విభజనకు కారణం జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్
  • సిక్కులు, ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించేందుకు వారు అంగీకరించలేదు
  • జిన్నా తొలుత పాకిస్థాన్ కావాలని అడగలేదు

దేశ విభజనకు మహ్మద్‌ అలీ జిన్నా కారణమని ఆరోపిస్తుంటారని, కానీ వాస్తవానికి అప్పటి జాతీయ నేతలు జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ లే కారణమని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్మమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. దేశవిభజనకు కారకులెవరన్న దానిపై సుదీర్ఘ కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూలోని షేర్‌–ఇ–కశ్మీర్‌ భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ముస్లింలకు మైనారిటీ హోదా ఇచ్చేందుకు ఈ ముగ్గురు నేతలు అంగీకరించలేదని అన్నారు.

ఇదే దేశవిభజనకు దారితీసిందని ఆయన చెప్పారు. జిన్నా పాకిస్థాన్ కావాలని మొదట్లో అడగలేదని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు, సిక్కులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలని మాత్రమే అడిగారని ఆయన చెప్పారు. దానికి కాంగ్రెస్ నిరాకరించిందని, దీంతోనే ప్రత్యేకదేశం డిమాండ్ కు జిన్నా మొగ్గుచూపారని భావిస్తున్నానని ఆయన అన్నారు.

 సిక్కులు, ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించి ఉంటే దేశం విడిపోయేది కాదని, తద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ దేశాలు కూడా ఉండేవికాదని, కేవలం భారతదేశం మాత్రమే ఉండేదని ఆయన తెలిపారు. మతం ఆధారంగా రాజకీయాలు చేయడం వల్ల దేశాభివృద్ధి, ఐక్యత, శాంతికి విఘాతం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మతం ఆధారంగా మరోసారి దేశాన్ని విభజించవద్దని ఆయన బీజేపీని కోరారు. 

  • Loading...

More Telugu News