conrad sangma: మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్‌కు భంగపాటు.. బీజేపీ మంత్రాంగంతో అధికారం దూరం!
- 21 సీట్లు సాధించినా దక్కని అధికారం
- 2 సీట్లున్న బీజేపీ పన్నిన వ్యూహంలో విలవిల
- 6న కాన్‌రాడ్ సంగ్మా సీఎంగా ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్‌కు ఏదీ కలిసి రావడం లేదు. మేఘాలయలో 21 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా భంగపాటు తప్పలేదు. 2 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ పన్నిన వ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు సాధించగా, లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్‌రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 19 స్థానాలను కైవసం చేసుకుంది.
కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పావులు కదిపిన బీజేపీ.. తనలాగే సింగిల్ డిజిట్ స్థానాలను దక్కించుకున్న యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ), హెచ్ఎస్ పీడీపీ, పీడీఎఫ్‌లను ఏకం చేసి ఎన్‌పీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పించింది. దీంతో ఎన్‌పీపీ బలం 34కు పెరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం సమకూరింది.
దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాన్‌రాడ్ సంగ్మాను గవర్నర్ గంగా ప్రసాద్ ఆహ్వానించారు. మంగళవారం సంగ్మా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన సంగ్మా తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందించారు.