C.Ramachandraiah: ఇద్దరు 'చంద్రుల'పై విరుచుకుపడిన రామచంద్రయ్య!
- ఓటుకు నోటు కేసులో బాబు..ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్
- తన జీవితంలో చీకటి కోణాలు చెప్పని బాబు
- ప్రత్యేక హోదా కోసం బాబు నిరాహార దీక్ష చేపట్టాలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లపై కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేసిన థర్డ్ ఫ్రంట్ ప్రకటన వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని ఆయన విమర్శించారు. బాబు ఓటుకు నోటు కేసులోనూ, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఇరుక్కుపోవడం వల్లే ఈ రకమైన వైఖరిని వారిద్దరూ అనుసరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ అప్పుల్లో కూరుకుపోయింటే చంద్రబాబు మాత్రం సొంత ఇంటిని నిర్మించుకున్నారని రామచంద్రయ్య విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి బాబుకు నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన జీవితంలోని చీకటి కోణాలను తప్ప మిగిలిన వాటినే ప్రజలకు చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు వైఖరి వల్లే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆ పార్టీకి దూరమయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం బాబు ఇతర పార్టీలను నిందించడానికి బదులుగా తానే ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని, ఇందుకు నిరాహార దీక్ష చేపట్టాలని రామచంద్రయ్య ఉచిత సలహా ఇచ్చారు.