Senior Asian Championship: 'గోల్డ్' మెడల్ సాధించింది..పేద తండ్రిని ఆదుకుంది...!
- ఆసియన్ చాంపియన్‍షిప్‌లో జపాన్ క్రీడాకారిణిపై గెలుపు
- తన కోసం అప్పుల పాలైన తండ్రిని ఆదుకుంటున్న వైనం
- ప్రభుత్వ మద్దతులేమిపై పెదవి విరుపు
పంజాబ్‌లోని బగారియా అనే చిన్న గ్రామానికి చెందిన పేద రైతు సుఖ్‌చైన్ సింగ్ పడిన కష్టానికి ఎట్టకేలకు కాస్త ఫలితం దక్కింది. అతని కుమార్తె, అంతర్జాతీయ రెజ్లర్ నవ్‌జోత్ కౌర్ (28) సీనియర్ ఆసియన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. తద్వారా పసిడి పతకాన్ని గెలుచుకున్న తొలి భారత మహిళగా ఆమె గుర్తింపు పొందింది. బిష్కెక్‌లో జరిగిన మహిళల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో జపాన్‌కి చెందిన మియా ఇమైని 9-1 తేడాతో కౌర్ చిత్తు చేసి, యావద్భారతదేశం జయహో అనేలా చేసింది. ఈ ఘనతలతో పాటు ఆమె తన ఎదుగుదలకు, తన ఆశయ సాధనకు తన వెన్నంటే ఉండి నడిపించి అప్పుల పాలైన తన తండ్రిని ఆదుకోగలిగింది.
దశాబ్ద కాలంలో కౌర్ తిండీతిప్పలు, శిక్షణ, దుస్తులు ఇతరత్రా అవసరాల కోసం సుఖ్‌చైన్ సింగ్ బ్యాంకులు ఇతర రుణదాతల నుంచి అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులు దాదాపు రూ.13 లక్షలకు చేరుకున్నాయి. బంగారు పతకం సాధించిన కౌర్ దశ తిరగనుంది. కొంత వరకు తన తండ్రి అప్పులను ఆమె తీర్చింది. కౌర్ విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబవుతున్నారు. తమకు ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదని, తమ బిడ్డ దేశం గర్వపడేలా చేసిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. అయితే తమ బిడ్డకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోవడంపై వారు పెదవివిరుస్తున్నారు.