KKR: వీడిన సస్పెన్స్... నైట్ రైడర్స్ పగ్గాలు దినేశ్ కార్తీక్‌కే
- ముగిసిన గౌతమ్ గంభీర్ పదవీకాలం
- కెప్టెన్ రేసులో క్రిస్ లిన్, ఊతప్ప...చివరికి కార్తీక్‌కే పట్టం
- వైస్ కెప్టెన్‌గా రాబిన ఊతప్ప
ఐపీఎల్-11 పోటీల్లో తలపడే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఇప్పటివరకు కొనసాగిన సస్పెన్స్ ఎట్టకేలకు వీడిపోయింది. గౌతమ్ గంభీర్ పదవీకాలం ఆదివారంతో ముగిసిపోవడంతో తదుపరి కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ పేరును ఫ్రాంఛైజీ సీఈఓ వెంకీ మైసూర్ ప్రకటించారు. కేకేఆర్ స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమం 'నైట్ క్లబ్'లో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అనుభవజ్ఞుడయిన దినేశ్ జట్టుకు నాయకత్వం వహించడం తమకు ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కెప్టెన్ పదవికి పోటీ పడిన వారిలో క్రిస్ లిన్, రాబిన్ ఊతప్ప పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరికి ఆ అవకాశం దినేశ్‌నే వరించింది. ఊతప్ప వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో దినేశ్‌ని కేకేఆర్ రూ.7.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
జట్టు వివరాలు : దినేశ్ కార్తీక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప (వైస్ కెప్టెన్), సునీల్ నరైన్, ఆండ్రీ రుస్సెల్, క్రిస్ లిన్, మిచెల్ స్టార్క్, కులదీప్ సింగ్ యాదవ్, పీయూష్ చావ్లా, నితీశ్ రానా, కమలేశ్ నాగర్ కోటి, శివమ్ మావి, మిచెల్ జాన్సన్, శుభ్‌మన్ గిల్, రంగనాథ్ వినయ్ కుమార్, రింకు సింగ్, కేమరూన్ డెల్ పోర్ట్, జావోన్ సీర్ లెస్, అపూర్వ్ విజయ్ వాంఖడే, ఇశాంక్ జగ్గీ