Andhra Pradesh: త్వరలో 203 'అన్న' క్యాంటీన్లు...ప్లేటు ఇడ్లీ రూపాయి...భోజనం ఐదు రూపాయలు
- 1600 చదరపు గజాల విస్తీర్ణంలో క్యాంటీన్
- 3765 చదరపు గజాల విస్తీర్ణంలో కిచెన్-క్యాంటీన్
- తనిఖీ అనంతరం ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమీషనర్లకు ఆదేశం
పేదల ఆకలిని తీర్చే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ నెలాఖరు కల్లా ఇవి అందుబాటులోకి రావచ్చు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 71 మున్సిపాలిటీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్‌లలో వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఓ జీవోను విడుదల చేసింది. క్యాంటీన్ల ఏర్పాటుకు తగు ప్రాంతాలను గుర్తించాలని అందులో కోరింది. క్యాంటీన్‌తో పాటు వంటగది కూడా ఒకేచోట ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
పిఠాపురం, సామర్లకోట, మండపేట, తుని, అమలాపురంలలో క్యాంటీన్ కమ్ కిచెన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. క్యాంటీన్లకు అనువైన ప్రాంతాలను పరిశీలించిన పిదప తగు ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమీషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. క్యాంటీన్లను 1600 చదరపు గజాల విస్తీర్ణంలోనూ, కిచెన్లు, కిచెన్-క్యాంటీన్లను 3765 చదరపు గజాల విస్తీర్ణంలోనూ ఏర్పాటు చేస్తారు.
జిల్లాల వారీగా క్యాంటీన్ల వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి-18, శ్రీకాకుళం-6, విజయనగరం-6, విశాఖపట్నం-27, కృష్ణ-26, గుంటూరు-33, ప్రకాశం-9, నెల్లూరు-5, చిత్తూరు-13, కర్నూలు-20, అనంతపురం-24. ఈ క్యాంటీన్లలో ప్లేటు ఇడ్లీ రూ.1, భోజనం రూ.5కే అందివ్వనున్నారు.