Election: సూర్యుడు ‘ఎర్ర’గా అస్తమించి.. ‘కాషాయ రంగు’లో ఉదయిస్తాడు: త్రిపుర విజయంపై మోదీ ట్వీట్
- ఎన్నికల విశ్లేషకులు ఇప్పటికైనా దృక్పథం మార్చుకోవాలి
- శూన్యం లోంచి శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాం
- త్రిపురలో విజయం అనంతరం మోదీ ట్వీట్
త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సీపీఎం 25 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది. త్రిపురలో తొలిసారి విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. సూర్యుడు ఎర్ర రంగులో అస్తమిస్తాడని, కాషాయ రంగులో ఉదయిస్తాడని సీపీఎంను ఉద్దేశించి పేర్కొన్నారు. దేశంలోని ఎన్నికల విశ్లేషకులు ఇప్పటికైనా ఓ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిదని.. ఎవరూ లేని దగ్గర ఒక్కరిగా ఎదగవచ్చని, శూన్యం నుంచి శిఖరాలకు చేరుకోవచ్చన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.
త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 59 సీట్లకు గాను బీజేపీ 43 స్థానాలను గెలుచుకుని సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అధికార సీపీఎం కేవలం 16 స్థానాలకే పరిమితమైంది. మొత్తం మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా మేఘాలయలో కాంగ్రెస్ 21, ఎన్‌పీపీ 19, ఇతరులు 17, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం లేకపోవడంతో స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 29, ఎన్‌పీఎఫ్ 29, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.