KCR: ఏపీకి 'ప్ర‌త్యేక హోదా' ఇస్తాన‌ని మోదీ అన్నారు.. ఇచ్చారా?: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

  • దేశాన్ని 70 ఏళ్లు కాంగ్రెస్‌, బీజేపీలే పాలించాయి
  • ఆయా పార్టీలు చెప్పేదొకటి చేసేదొకటి
  • ప్రజలకు ఏది చెప్పినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలి
  • భవిష్యత్తులో దేశంలో మూడో ఫ్రంట్ రావచ్చు

దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ... దేశాన్ని 70 ఏళ్లు కాంగ్రెస్‌, బీజేపీలే పాలించాయని చెప్పారు. ఆయా పార్టీలు చెప్పేదొకటి చేసేదొకటని, ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఉండకూడదని అన్నారు. ప్రజలకు ఏది చెప్పినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలని, దాన్ని అమలు చేసి తీరాలని వ్యాఖ్యానించారు.

'మోదీగారు అన్నారు కదా.. ప్రత్యేక హోదా ఇస్తామని, అన్నట్లే ఇచ్చి తీరాలి.. అలా అనకపోతే నేను అనలేదు, ఇవ్వను అని చెప్పేయాలి. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు ఆవేదన పడడం, పార్టీల నేతలు ఆవేదన పడడం ఏంటీ?... ఇలా ఉండొచ్చా? ఇలా ఏ దేశంలోనైనా ఉందా ఆ పరిస్థితి? ఇలా ప్రజలను వంచిస్తున్నారు. ప్రజలు వంచన నుంచి బయటపడాలి. ఓ పని చేయాల్సి ఉంది. నా ఆరోగ్యం బాగుంటే ఆ పని తప్పకుండా చేస్తాను' అని అన్నారు. భవిష్యత్తులో దేశంలో మూడో ఫ్రంట్ రావచ్చని తెలిపారు. సీపీఎం నేత సీతారాం ఏచూరితో ఇప్పటికే ఈ విషయమై మాట్లాడానని అన్నారు.

రైతులకు ఇన్నాళ్లు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేంటో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. రెండు పార్టీలే దేశాన్ని పాలిస్తున్నాయని, భవిష్యత్తులో బీజేపీ పోయి మళ్లీ కాంగ్రెస్ వస్తే దేశంలో ఏదైనా మార్పు వస్తుందా? అని ప్రశ్నించారు. దేశంలో పరివర్తన ఆవశ్యకత ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News