Farmers: ఎర్రగా మారిపోతున్న తమిళనాడు చెరువులు.. టమాటాలను చెరువుల్లో పారబోస్తున్న రైతులు!
- తమిళనాడులో పెరిగిన టమాటా దిగుబడి
- రూ.20 నుంచి రూ.2కి పడిపోయిన కిలో ధర
- మరోదారిలేక చెరువుల్లో పారబోస్తున్న రైతులు
తమిళనాడులోని చెరువులు ఎర్రగా మారిపోతున్నాయి. రైతులు తాము కష్టపడి పండించిన తాజా టమాటాలను తీసుకెళ్లి చెరువుల్లో డంప్ చేస్తున్నారు. కిలో టమాటాల ధర రూ.20 నుంచి ఒక్కసారిగా రెండు రూపాయలకు పడిపోవడమే ఇందుకు కారణం. రాయకొట్టై, కృష్ణగిరి జిల్లాలతోపాటు సేలంలోని వేలప్పడి టమాటా మార్కెట్‌కు ప్రసిద్ధి. ఇప్పుడిక్కడి రైతులు సమీపంలోని చెరువుల్లో టమాటాలను పారబోస్తున్నారు. కనీస పెట్టుబడి కూడా రాకపోవడం, మార్కెట్లో కిలోకు రూపాయి, రెండు రూపాయలు పలుకుతుండడంతో ఆవేదన చెందిన రైతులు మరో మార్గం లేక ఇలా చేస్తున్నట్టు తమిళ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధీవ సిగమాని తెలిపారు.
తక్కువ సమయంలో దిగుబడి వచ్చే టమాటా పంటను రైతులు అందరూ ఒకేసారి ఎంచుకోవడంతో దిగుబడి ఎక్కువై ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో చెరకు, అరటి, చింత వంటి దీర్ఘకాలంలో దిగుబడి వచ్చే పంటలను పండించే అలవాటు లేదని ఆయన పేర్కొన్నారు. అందరూ టమాటా పంటనే ఎంచుకోవడంతో దిగుబడి పెరిగి ధర తగ్గి చివరికి పారబోయాల్సిన పరిస్థితి వచ్చిందని సిగమాని ఆవేదన వ్యక్తం చేశారు.
టమాటా పంటతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామి కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాతీయ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.