Marriage: హైదరాబాద్‌లో రేపు భారీగా 'పీపీపీ.. డుండుండుం'.. ఒక్కటవనున్న 50 వేల జంటలు!
- రేపు ఒక్కరోజే 20 ముహూర్తాలు
- కల్యాణకాంతులు సంతరించుకున్న భాగ్యనగరం
- అన్నింటికీ ఫుల్ డిమాండ్
ఫాల్గుణమాసం.. ఆదివారం.. కృష్ణపక్షం, తదియ.. వివాహానికి ఇంతకంటే శుభముహూర్తం ఉండదేమో! ఆదివారం ఈ శుభముహూర్తం రోజున ఒక్కటయ్యేందుకు వేలాది జంటలు ఎదురుచూస్తున్నాయి. ఒక్క భాగ్యనగరంలోనే 50 వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు బుక్ అయిపోగా వధూవరుల లోగిళ్లు కల్యాణ కాంతులు సంతరించుకున్నాయి. ఇక, పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు వచ్చే వారితో నగరం బిజీగా మారింది.
గత మూడు నెలలుగా సరైన ముహూర్తాలు లేకపోవడం, శ్రావణంలో రెండు మూడు, కార్తీకమాసంలో రెండు ముహుర్తాలే ఉండటంతో మార్చిలోనే కానిచ్చేయాలని చాలామంది భావిస్తున్నారు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న జంటలకు ఆదివారం నాటి ముహూర్తం బాగా కలిసివచ్చింది.
ఈ ముహూర్తం అన్ని రాశులు, నక్షత్రాల వారికి కలిసి వస్తుందని, లగ్న బలం బాగుందని తెలంగాణ అర్చక సమితి నగర కార్యదర్శి రఘుచరన్ శర్మ తెలిపారు. తెల్లవారుజామున, ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆదివారం ఒక్కరోజే 20 వరకు ముహూర్తాలు ఉన్నట్టు ఆయన వివరించారు. 5వ తేదీన సోమవారం కూడా నగరంలో మరో 30 వేల పెళ్లిళ్లు జరగనున్నాయి.
ఇలా ఒకేరోజు వేలాది పెళ్లిళ్లు జరగనుండడంతో వివాహ సంబంధిత పనులకు అన్నింటికీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పూలు, షామియానాల నుంచి కూరగాయలు, పెళ్లిమండపాలు, వేదికలకు అలంకరించే పూలు, డెకరేటర్లు, వంట చేసే వాళ్లు.. ఇలా అందరికీ, అన్నింటికీ డిమాండ్ ఏర్పడింది. పూల ధరలు రెట్టింపు అయ్యాయి. వంట సహాయకులకు గతంలో రోజుకు రూ.800 వరకు చెల్లించేవారు.. ఇప్పుడు రూ.2వేలు లేకుండా రాబోమని తెగేసి చెప్పేస్తున్నారు.
సంపన్నులు ఈవెంట్ మేనేజ్‌మెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. థీమ్ మ్యారేజీల కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయినా, ఆది, సోమవారాల్లో ఖాళీ లేదంటూ ఈవెంట్ మేనేజర్లు చేతులెత్తేస్తున్నారు. ట్రావెల్స్ బస్సులు, వాహనాలు కూడా పెళ్లిళ్లకు బుక్ అయిపోయాయి. ఖరీదైన కార్లకు డిమాండ్ ఉండడంతో బెంగళూరు, చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నట్టు నగరంలోని ట్రావెల్ ఏజెన్సీల వారు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో 200 దాటని బుకింగ్‌లు ఆదివారానికి మాత్రం 650 అయినట్టు తెలిపారు.