Andhra Pradesh: కృష్ణా బోర్డు నిర్ణయం : తెలంగాణకు 24 , ఏపీకి 9 టీఎంసీల కేటాయింపు
- కృష్ణా నదిలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత 33 టీఎంసీలు
- దీని ఆధారంగా ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు
- ఈ మేరకు త్రిసభ్య కమిటీ నిర్ణయం
కృష్ణా నదిలో ప్రస్తుతం ఉన్న 33 టీఎంసీల నీటి లభ్యత ఆధారంగా తెలంగాణకు 24 టీఎంసీలు, ఏపీకి 9 టీఎంసీలు కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్ దగ్గర కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ లోని జలసౌధలో కమిటీ ఈరోజు సమావేశమైంది. మార్చి 20 వరకు సాగర్ నీటి మట్టం 520 అడుగులు ఉండేలా రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మార్చి చివరికి 515 అడుగుల నీటిమట్టం ఉండేలా ఒప్పందం కుదిరింది.
ఇందుకుగాను శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను సాగర్ కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. సాగర్ కనీస నీటి మట్టం తగ్గిపోతే గత సంవత్సరం తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాలకు నీళ్ళందించలేక ఇబ్బందులు పడిన విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా శ్రీశైలం నీరు విడుదల చేయాలని కోరింది. వచ్చే ఆగస్టు వరకు తెలంగాణకు 46 టీఎంసీల అవసరం ఉన్నట్టు ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రబీ పంటకు సాగునీటిని అందించాల్సి ఉందని కూడా తెలంగాణ వివరించింది.