Chandrababu: చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. విభజన సమస్యలపై చర్చిద్దామన్న బీజేపీ అధ్యక్షుడు!
- కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని ఈ రోజు మరోసారి స్పష్టం చేసిన టీడీపీ
- విభజన హామీలపై చర్చిద్దామని ఫోన్‌లో చెప్పిన అమిత్ షా
- ఈ నెల 5న కేంద్ర మంత్రులతో చర్చించనున్న సుజనా చౌదరి బృందం
ఈ రోజు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిపి, ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా పార్లమెంటు సమావేశాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. విభజన సమస్యలపై చర్చిద్దామని అమిత్ షా అన్నారు. దీంతో ఈ నెల 5న తాము కేంద్ర మంత్రి సుజనా చౌదరి బృందాన్ని చర్చలకు పంపుతామని చంద్రబాబు నాయుడు చెప్పారు. హామీల సాధన విషయంలో తాము రాజీపడబోమని అమిత్ షాకు చంద్రబాబు తెలిపారు. తాము ప్రజల డిమాండ్ కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు.