India: వంకర బుద్ధిని మరోసారి చూపించిన పాకిస్థాన్... భారత రాయబారికి అవమానం!
- అజయ్ బిసారియాకు క్లబ్ సభ్యత్వం ఇవ్వని పాక్
- దరఖాస్తు చేసుకుని రెండు నెలలు దాటినా నో క్లియరెన్స్
- దారుణంగా ప్రవర్తిస్తున్న పాకిస్థాన్
పాకిస్థాన్ లో భారత రాయబారి అజయ్ బిసారియాను ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా దాయాది మరోసారి వంకర బుద్ధిని చూపించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇస్లామాబాద్ లో ఉన్నతాధికారులు మెంబర్లుగా ఉండే క్లబ్ లో బిసారియాకు స్థానం లేకుండా చేసింది. సాధారణంగా క్లబ్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోగా ముగిసే ప్రక్రియను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన పాక్ అధికారులు, ఆయన కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించారు. సరిహద్దు సమస్యలు, ఉగ్రవాదం తదితరాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా ఉన్న సత్సంబంధాలు ఇప్పటికే అంతంతమాత్రం కాగా, గతంలో ఎన్నడూ లేనట్టు పాక్ దారుణంగా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.విలాసవంతమైన ఇస్లామాబాద్ క్లబ్
వాస్తవానికి ఇస్లామాబాద్ లోని అన్ని దేశాల రాయబార కార్యాలయాలకూ అత్యంత సమీపంలో దాదాపు 350 ఎకరాల్లో గోల్ఫ్, స్విమ్మింగ్ పూల్ వంటి సకల సదుపాయాలతో ఉండే క్లబ్ లో కొత్త రాయబారి ఎవరైనా వస్తే, గంటల వ్యవధిలో మెంబర్ షిప్ లభిస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ లో బిసారియా పాక్ కు వెళ్లగా, ఇంతవరకూ ఆయనకు క్లబ్ సభ్యత్వాన్ని పాక్ ఇవ్వలేదు.ఇండియాలో గత సంవత్సరం మేలో పాక్ రాయబారిగా అబ్దుల్ బాసిత్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించిన సొహైల్ మొహమ్మద్ ను ఢిల్లీ శివారు ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారులు అనుమతించని నేపథ్యంలోనే పాక్ ఇలా పగ తీర్చుకుంటోందని తెలుస్తోంది.