- భారత్ లో 131కు చేరుకున్న బిలియనీర్ల సంఖ్య
- ప్రవాస భారతీయులతో కలుపుకుంటే 170 మంది బిలియనీర్లు
- తొలి మూడు స్థానాల్లో చైనా, అమెరికా, భారత్
భారత్ లో సంపన్నుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం చైనా, అమెరికాల తర్వాత అత్యధిక సంఖ్యలో సంపన్నులు ఉన్నది ఇండియాలోనే. ఈ వివరాలను 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ - 2018' వెల్లడించింది. 100 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న బిలియనీర్ల సంఖ్య మన దేశంలో 131కు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ జాబితాలో మరో 31 మంది చేరారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-6523632a893a363cbbc035bb434d9936d52ad9ff.jpg)
రిచ్ లిస్ట్ లో 819 మంది బిలియనీర్లతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో 571 బిలియనీర్లతో అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది. 123 బిలియన్ డాలర్ల ఆస్తులతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో 102 బిలియన్ డాలర్ల ఆస్తులతో వారెన్ బఫెట్, 90 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, 79 బిలియన్ డాలర్లతో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ నిలిచారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-d15f8b2d3ce6ee078ed222b2e39d8ca8b8d054d3.jpg)
భారత్ విషయానికి వస్తే... 45 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తొలి స్థానంలో నిలిచారు. 14 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 19వ స్థానాన్ని పొందారు. ప్రవాస భారతీయులను కూడా కలుపుకుంటే భారత బిలియనీర్ల సంఖ్య 170కి చేరుతుండటం గమనార్హం.