Holi: హైదరాబాద్ లో కనిపించని హోలీ సందడి... కారణాలివి!
- నేడు పని చేస్తున్న ప్రైవేటు స్కూల్స్
- కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
- వివాహాది శుభకార్యాల్లో బిజీబిజీ
- బోసిపోవాల్సిన రోడ్లు ట్రాఫిక్ తో కిటకిట
హోలీ పండగ వచ్చిందంటే హైదరాబాద్ లో కనిపించే సందడి అంతాఇంతా కాదు. వీధులన్నీ రంగు నీళ్లతో నిండిపోతాయి. కూడళ్లలో హోలికా దహనాన్ని ప్రజలు వైభవంగా నిర్వహించుకుంటారు. యువతీ యువకులు, చిన్నా పెద్దా తారతమ్యాలు లేకుండా పండగ జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం హోలీ పండగకు రెండు రోజుల సెలవు ఇచ్చినప్పటికీ సందడి కనిపించడం లేదు. హోలీ వేళ బోసిపోయే ప్రధాన రహదార్లు ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయి.
దీనికి కారణాలను విశ్లేషిస్తే, నేడు ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించలేదు. దీంతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పొద్దునే స్కూళ్లకు వెళ్లిపోయారు. పైగా నేడు ఇంటర్ పరీక్షలు జరుగుతూ ఉండటంతో చాలా మంది తల్లిదండ్రులు, టీనేజ్ విద్యార్థులు పరీక్షల హడావుడిలో, ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకున్నారు. పైగా వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటం కూడా హోలీ హడావుడిని తగ్గించింది.
ప్రభుత్వ కార్యాలయాలు మినహా ప్రైవేటు సంస్థలన్నీ పనిచేస్తుండటం, బ్యాంకులు సైతం నిన్ననే సెలవు తీసుకుని నేడు తెరచి వుండటంతో హోలీ సందడి నామమాత్రమైంది. కాగా, హోలీ నాడు తమ వ్యాపారాలు తృప్తికరంగా సాగుతాయని, వివిధ రకాల రంగులు, హోలీ గన్స్ విక్రయించే వ్యాపారులు, ఈ సంవత్సరం కనీస పెట్టుబడి కూడా రావడం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.