Uttar Pradesh: పుట్టెడు దుఃఖంలోనూ విధులకే ప్రాధాన్యం ఇచ్చిన కానిస్టేబుల్.. పోలీస్ వ్యవస్థకే వన్నెతెచ్చిన భూపేంద్ర!

  • కుమార్తె చనిపోయినట్టు తెలిసినా విధినిర్వహణకే ప్రాధాన్యం
  • కత్తిపోట్లకు గురై చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తిని కాపాడిన వైనం
  • అభినందిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ కానిస్టేబుల్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ విధులకే ప్రాధాన్యం ఇచ్చిన అతడిని చూసి మొత్తం పోలీస్ వ్యవస్థే గర్వపడుతోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

అది ఫిబ్రవరి 23. ఉదయం 9 గంటలవుతోంది. షహరాన్‌పూర్‌లో 100 పోలీసు వాహనంపై హెడ్ కానిస్టేబుల్ భూపేంద్ర తోమర్ (57), అతడి బృందం అప్రమత్తంగా ఉంది. అదే సమయంలో బడాగావ్ ప్రాంతంలో రోడ్డుపై ఓ వ్యక్తి కత్తిపోట్లతో పడి ఉన్నాడని సమాచారం అందింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా భూపేంద్ర తన బృందంతో ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగానే భూపేంద్రకు మరో ఫోన్ కాల్ వచ్చింది. తన కుమార్తె జ్యోతి (27) అకస్మాత్తుగా మృతి చెందిందనేది ఆ ఫోన్ కాల్ సారాశం. నర్స్‌గా పనిచేస్తున్న జ్యోతికి గతేడాదే వివాహం అయింది.

వార్త విన్న వెంటనే భూపేంద్ర గుండెలు పగిలిపోయినంత పనైంది. షాక్‌కు గురయ్యారు. ఇంకొకరైతే వెంటనే ఇంటికి వెళ్లేవారే. కానీ భూపేంద్రకు తాను విధుల్లో ఉన్నానన్న విషయం గుర్తుకు వచ్చింది. అంతటి దుఃఖంలోనూ విధులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారు. నిజానికి తన బృందాన్ని కాల్ వచ్చిన ప్రదేశానికి పంపించి ఆయన ఇంటికి వెళ్లవచ్చు. కానీ ఆయన ఆ పనిచేయలేదు. ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఫోన్ కాల్ వచ్చిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై కత్తిపోట్లతో పడి ఉన్న వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించి అతడి ప్రాణాలు కాపాడారు.

‘‘చావుబతుకుల్లో ఉన్న ఓ వ్యక్తిని కాపాడడమే నా కర్తవ్యమని భావించా. అది నా విధి మాత్రమే. అంతేకానీ నేనేదో గొప్ప పనిచేశానని అనుకోవడం లేదు’’ అని భూపేంద్ర చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. విషయం తెలిసిన షహరాన్‌పూర్ డీఐజీ శరద్ సచిన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) బబ్లూ కుమార్‌లు భూపేంద్రను లక్నోలో ఈ రోజు సత్కరించనున్నారు.

Uttar Pradesh
Bhupendra Tomar
constable
  • Loading...

More Telugu News