BJP: అమిత్ షాతో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు భేటీ.. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ!
- ఢిల్లీలో అమిత్ షాతో గంటన్నర పాటు సమావేశం
- రెవెన్యూ లోటు, రైల్వేజోన్, కడపలో ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజ్ కు సంబంధించిన నిధులపై చర్చ
- ఈ భేటీలో పాల్గొన్న ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భేటీ అయ్యారు. ప్రధానంగా నాలుగు అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఈరోజు ఆయన్ని కలిసి రాష్ట్ర విభజన హామీల అమలు విషయమై వారు చర్చించినట్టు సమాచారం. రెవెన్యూ లోటు, రైల్వేజోన్, కడపలో ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజ్ కు సంబంధించిన నిధుల గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబుకు వారు వివరిస్తారు. అనంతరం తదుపరి నిర్ణయం వెలువడుతుందని సమాచారం. కాగా, ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, ఈ నెల 5 లోపు ఓ ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 5 నుంచి మలి విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమిత్ షాతో గంటన్నర పాటు జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత లభించినట్టయింది.