Ram Nath Kovind: రాష్ట్రపతి కోవింద్ ను వెంటాడుతున్న గతంలో చేసిన వ్యాఖ్యలు

  • రాష్ట్రపతిని అడ్డుకుంటామంటున్న అలీఘడ్ యూనివర్శిటీ విద్యార్థులు
  • ఇస్లాం పరాయి దేశానికి చెందిందంటూ గతంలో వ్యాఖ్యలు
  • క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్న విద్యార్థులు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. లక్నోలోని అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థుల నుంచి ఆయనకు నిరసన ఎదురవుతోంది. ఈ నెల 7న యూనివర్శిటీలో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి విద్యార్థి సంఘం కోవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

దీనికి కారణం గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే. 2010లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన... రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికపై స్పందిస్తూ, ముస్లింలు, క్రిస్టియన్లను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కమిషన్ సిఫారసులు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. మరి సిక్కులకు ఈ కేటగిరీలో స్థానాన్ని ఎలా కల్పించారని ప్రశ్నించగా... సిక్కులు భారతీయులని... ఇస్లాం, క్రైస్తవ మతాలు మన దేశానికి పరాయివని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి.

ఈ సందర్భంగా ఏఎంయూ విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ, గతంలో చేసిన వ్యాఖ్యలకు కోవింద్ క్షమాపణలు చెప్పాలని... లేకపోతే స్నాతకోత్సవానికి హాజరుకావడం మానుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి వ్యాఖ్యల పట్ల విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా... దానికి రాష్ట్రపతి, వైస్ ఛాన్సెలర్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News