Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి, గవర్నర్ లపై హీరో శివాజీ తీవ్ర వ్యాఖ్యలు

- ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్
- బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయాలు చేస్తున్నారు
- కేంద్రానికి ఏపీని తాకట్టుపెట్టి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు: శివాజీ
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్ నరసింహన్ రాజకీయాలు చేస్తున్నారని హీరో శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి గుంటూరులో ఈరోజు నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి న్యాయం కోసం మన కంటే ముందు ఎంపీలు పోరాడాలని, పార్లమెంట్ ఉభయ సభలు జరగకుండా చేస్తే సగం విజయం సాధించినట్లేనని చెప్పిన శివాజీ, ఎంపీలు నాటకాలాడుతున్నారంటూ మండిపడ్డారు. కాగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపైనా శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ఏపీని తాకట్టుపెట్టి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారని, ఏపీకి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తే వెంకయ్యనాయుడికి కోపం వస్తోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోతే లాభం లేదని, ‘హోదా’ లేకపోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి చేసేదేమీ ఉండదని అన్నారు.