De Bears: నీరవ్ మోదీ ఎఫెక్ట్... కఠిన నిర్ణయం తీసుకున్న అతిపెద్ద వజ్రాల మైనింగ్ కంపెనీ 'డిబీర్స్'!
- 10 శాతం తగ్గిన ముడి వజ్రాల సరఫరా
- మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన డిబీర్స్
- నాణ్యత, పారదర్శకత పాటిస్తేనే ముడి వజ్రాలిస్తామంటున్న డిబీర్స్
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం, ఇండియాలో వజ్రాల వ్యాపారంలో పేరున్న నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ వంటి పేర్లతో పాటు ప్రముఖ వజ్రాభరణాల రిటైల్ సంస్థ గీతాంజల్సి జెమ్స్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రపంచంలోనే వజ్రాల వెలికితీతలో నంబర్ వన్ కంపెనీగా ఉన్న డిబీర్స్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇండియాకు పంపే ముడి వజ్రాల వాటాను తగ్గించినట్టు ప్రకటించింది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే, ఈ సంవత్సరం ఇండియాకు ముడి వజ్రాలను 10 శాతం మేరకు తగ్గించినట్టు ప్రకటించింది.
ఇండియాలో వెలుగులోకి వస్తున్న కుంభకోణంతో తమ సంస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావించిందని, ఆ కారణం చేతనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. అయితే, మరిన్ని వివరాలు ఇవ్వడానికి మాత్రం డిబీర్స్ గ్రూప్ మీడియా విభాగం నిరాకరించింది. వ్యక్తిగత వ్యాపారులు తాము చేస్తున్న బిజినెస్ లో చేసే తప్పులకు తమ సంస్థ బాధ్యత ఏంటని, అయితే, తాము ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటించే వ్యాపారులకు, పూర్తి పారదర్శకతతో కూడిన వ్యాపారం చేసేవారికి మాత్రమే ముడి వజ్రాలను సరఫరా చేయాలని నిర్ణయించామని పేర్కొంది. ఇదే సమయంలో ఆర్థిక సంవత్సరం ముగిసే ఫిబ్రవరి, మార్చి నెలల్లో వజ్రాల వ్యాపారం సాధారణంగానే తక్కువగా ఉంటుందని కూడా డిబీర్స్ గుర్తు చేసింది.