Chandrababu: తొలి ఎన్నికలకు చంద్రబాబు పెట్టిన ఖర్చు ఇంతే!
- 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం
- ఎన్నికల ఖర్చు రూ. 89 వేలు
- బుల్లెట్, ఎజ్డీపై తిరిగిన చంద్రబాబు
సరిగ్గా 40 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్థానం ప్రారంభమయింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలకే లక్షలు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. మరి తాను ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ఖర్చు చేశారా తెలుసా? కేవలం రూ. 89 వేలు మాత్రమే. అందులో అధిక భాగం మొత్తాన్ని ఆయన తండ్రి ఖర్జూరనాయుడు చెరకు పండించి, బెల్లం విక్రయించి సంపాదించిన డబ్బు. మిగిలిన మొత్తాన్ని ఆయన స్నేహితులు, సన్నిహితులు సర్దారు.
చంద్రబాబు తరపున ప్రచారంలో కూడా కేవలం రెండు, మూడు కార్లు మాత్రమే ఉండేవి. అద్దెకు తీసుకుందామన్నా దొరికేవి కాదు. దీంతో, ఎక్కువగా బైకులనే వాడారు. చంద్రబాబు బుల్లెట్, ఎజ్డీ బైకులు వినియోగించేవారు. ఒక్కో బైకుపై ముగ్గురేసి కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్న మొత్తంలో కొంత భాగాన్ని పత్రికల్లో ప్రకటనలకు వినియోగించారు.
ప్రచారంలో పాల్గొనే సందర్భంగా ఆయన తల్లి అమ్మణ్ణమ్మ వంట చేసి పెట్టేవారు. ఆ తర్వాత తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసేవారట. అప్పటి ఎన్నికల ప్రచారంలో భోజనాలు, ప్రయాణాలకే ఎక్కువ ఖర్చు అయిందట. అయినా, 40 ఏళ్ల క్రితం రూ. 89 వేల ఖర్చు అంటే తక్కువేం కాదు.