India: జీడీపీ వృద్ధిలో చైనాను దాటేసిన భారత్
- అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 7.2 శాతం
- 6.8 శాతానికే పరిమితమైన చైనా
- 2016-17 తరువాత ఈ స్థాయికి భారత జీడీపీ చేరడం ఇదే తొలిసారి
గడచిన అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 7.2 శాతం స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును సాధించడం ద్వారా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన తొలి స్థానాన్ని మరోసారి సాధించింది. బుధవారం నాడు విడుదలైన కేంద్ర గణాంకాల ప్రకారం, 2016-17 జూలై - సెప్టెంబర్ తరువాత, ఈ స్థాయిలో వృద్ధి రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ త్రైమాసికంలో భారత్ 6.9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని 35 మంది ఆర్థిక వేత్తల అంచనాలను తారుమారు చేస్తూ, చైనాను మించిన వృద్ధిని భారత్ నమోదు చేసింది. ఇదే మూడు నెలల కాలంలో చైనా 6.8 శాతం వృద్ధికే పరిమితమైంది.
కాగా, అంతకుముందు ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో భారత జీడీపీ మూడేళ్ల కనిష్ఠ స్థాయిలో 5.7 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుతో పాటు, జీఎస్టీ అమలుతో వృద్ధి రేటు మందగించింది. అయితే, ఆ తరువాతి కాలంలో జీఎస్టీ ఫలాలు అందడంతో జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.5 శాతానికి మెరుగుపడింది. ఇదే సమయంలో మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి తొలుత ప్రకటించిన 6.6 శాతం నుంచి 6.5 శాతానికి సవరిస్తున్నట్టు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది.
ఇక డిసెంబర్ త్రైమాసికంలో ఉత్పత్తి రంగం 8.9 శాతం వృద్ధి రేటును నమోదు చేయగా, వ్యవసాయ రంగం 4.1 శాతం, నిర్మాణ రంగం 6.8 శాతం, ఆర్థిక సేవల విభాగం 6.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మౌలిక రంగం 6.7 శాతం వృద్ధిని సాధించగా, బొగ్గు, క్రూడాయిల్ ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి తదితర విభాగాలు గణనీయమైన ప్రగతిని సాధించాయి.