tip-off: కార్తీని అరెస్ట్ చేసే విషయాన్ని సీబీఐ ఎంత సీక్రెట్‌గా ఉంచిందంటే..!
- కార్తీ అరెస్ట్ విషయాన్ని రహస్యంగా ఉంచిన సీబీఐ
- విమానాశ్రయానికి వెళ్లే వరకు చాలామందికి తెలియని వైనం
- కార్తీకి ఉప్పందిస్తారన్న అనుమానంతోనే సీబీఐ సీక్రెట్ ఆపరేషన్
కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు ఐఎన్ఎక్స్ మీడియా నుంచి ముడుపులు తీసుకున్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. కార్తీని అరెస్ట్ చేసే విషయాన్ని సీబీఐ చివరి వరకు అత్యంత రహస్యంగా ఉంచింది. ఎంత రహస్యంగా అంటే.. అరెస్ట్ చేసేందుకు వెళ్లే వరకు సీబీఐ బృందంలోని చాలామందికి ఆ విషయం తెలియదు. ఒకవేళ ఈ విషయం అందరికీ తెలిస్తే కార్తీకి ఎక్కడ ఉప్పందించేస్తారో అన్న అనుమానంతోనే అరెస్ట్ విషయాన్ని సీబీఐ ‘టాప్ సీక్రెట్’గా ఉంచిందట. విషయం కార్తీకి చేరితే ఆయన తప్పించుకోవడమో, కోర్టును ఆశ్రయించడమో చేస్తారన్న ఉద్దేశంతోనే ఇలా రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.
‘‘చెన్నై విమానాశ్రయం నుంచి కార్తీని అదుపులోకి తీసుకుంటారన్న విషయం సీబీఐలోనే చాలామందికి తెలియదు. మొత్తం ఆపరేషన్ చాలా రహస్యంగా జరిగింది. ఇతర దర్యాప్తు సంస్థలకు కూడా ఈ విషయం తెలియనంత రహస్యంగా జరిగింది. అరెస్ట్ విషయం కార్తీకి చివరి వరకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.