Kanchi: కంచి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి... పట్టాభిషేకానికి ఏర్పాట్లు!
- 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
- తన వారసుడిగా శంకర విజయేంద్ర పేరును ప్రకటించిన జయేంద్ర
- 14వ ఏటనే సన్యాసం స్వీకరించిన శంకర విజయేంద్ర
- త్వరలోనే పట్టాభిషేకం
కంచి కామకోటి పీఠం 69వ అధిపతిగా ఉన్న జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడంతో, ఆయన వారసుడిగా, 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేసే ఏర్పాట్లు మొదలయ్యాయి. శంకర విజయేంద్ర సరస్వతి అసలు పేరు శంకర నారాయణన్. కాగా, ఆయన మార్చి 18, 1969న తమిళనాడు తిరువళ్లూరు జిల్లా అరణి సమీపంలోని పెరియపాళయం అనే గ్రామంలో జన్మించి, తన 14వ ఏట, మే 29, 1983న సన్యాసం స్వీకరించారు.
అప్పటి నుంచి జయేంద్ర సరస్వతి వెంటే నడిచారు. ఆయన చుట్టూ వివాదాలు కమ్ముకున్న వేళ, జైలుకు వెళ్లిన వేళ తోడుగా నిలిచారు. దేశమంతా పర్యటించి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. యువతను సన్మార్గంలో నడిపించడం, ఉన్నత విద్యా ప్రమాణాలు, భారత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం తన లక్ష్యాలని వెల్లడించే శంకర విజయేంద్ర సరస్వతి, విదేశీ భక్తుల కోసం పలు ప్రచురణలను తీసుకు వచ్చారు. గతంలోనే జయేంద్ర సరస్వతి తన వారసుడిగా శంకర విజయేంద్ర సరస్వతి పేరును ప్రకటించిన నేపథ్యంలో, అతి త్వరలో ఆయనకు పట్టాభిషేకం జరిపి, కంచి మఠం పూర్తి బాధ్యతలను అప్పగించే ఏర్పాట్లు సాగుతున్నాయి.