central bank: ఈసారి వస్త్రాల కంపెనీ.. 16 బ్యాంకులకు రూ.3,972 కోట్ల మేర కుచ్చుటోపీ!
- పెరుగుతున్న బ్యాంకు మోసగాళ్ల జాబితా
- 16 బ్యాంకులను ముంచిన శ్రీలక్ష్మి కొటిన్స్
- నికర ఆస్తులు రూ.1495 కోట్లు.. అప్పులు రూ.3972 కోట్లు
బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేస్తున్నవారి జాబితా పెరిగిపోతోంది. మొన్న నీరవ్ మోదీ, నిన్న రోటోమాక్ పెన్నుల అధినేత విక్రమ్ కొఠారీ, నేడు వస్త్రాల తయారీ కంపెనీ శ్రీ లక్ష్మీ కొటిన్స్ లిమిటెడ్. పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోదీ రూ.11,300 కోట్ల మేర మోసం చేస్తే, విక్రమ్ కొఠారీ రూ.3,695 కోట్ల మోసగించాడు. ఇప్పుడు శ్రీలక్ష్మీ కొటిన్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఎంపీ అగర్వాల్ మొత్తం 16 బ్యాంకులను రూ.3,972 కోట్ల మేర ముంచాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాతోపాటు మొత్తం 16 బ్యాంకుల నుంచి అగర్వాల్ పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేశాడు. దీంతో రంగంలోకి దిగిన బ్యాంకు అధికారులు కంపెనీ ఆస్తులను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కంపెనీ ఆస్తులను వేలం వేయాలని యోచిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే రూ.1646 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుండగా, కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రూ.1,495 కోట్లు మాత్రమే. బ్యాంకులను మోసం చేసింది రూ.3,695 కోట్లకు. దీంతో అంత సొమ్మును ఎలా రికవరీ చేయాలో తెలియక బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.