jayendra saraswathi: రేపు ఉదయం జయేంద్ర సరస్వతి మహాసమాధి!
- ఈరోజు ఉదయం పరమపదించిన 69వ కంచి పీఠాధిపతి
- పార్థివదేహానికి శాస్త్రోక్తమైన పూజలు నిర్వహించిన శిష్యులు
- చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే మహాసమాధికి ఏర్పాట్లు
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) ఈరోజు ఉదయం పరమపదించిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 8 గంటలకు ఆయన మహాసమాధి కానున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడ్డ ఆయన నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు.
దీంతో, కంచి మఠానికి చెందిన ఆసుపత్రికి ఆయన శిష్యులు తరలించారు. జయేంద్ర సరస్వతికి మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈరోజు ఉదయం కంచిలోని శంకర మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన పార్థివదేహాన్ని కంచి మఠానికి తరలించి శాస్త్రోక్తమైన పూజలు నిర్వహించారు.
కాగా, అభినవ శంకరులుగా ప్రసిద్ధిగాంచిన జయేంద్ర సరస్వతి 1935, జులై 18న తమిళనాడులోని మన్నార్ గుడి సమీపంలోని ఇరుల్ నిక్కి గ్రామంలో జన్మించారు. 1954 మార్చి 24న కంచి పీఠానికి 69వ పీఠాధిపతిగా ఆయన నియమితులయ్యారు.