Andhra Pradesh: ఏపీ సీఎస్ తో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధి బృందం భేటీ
- గతంలో ఆ యూనివర్శిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
- కార్యాచరణ ప్రణాళిక అమలుకు రూపొందించిన నివేదికపై సంతకం చేసిన దినేష్ కుమార్
- వచ్చే ఏప్రిల్ 1 నుండి అమలుకు చర్యలు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తో ఎల్ కెవై స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధి బృందం ఈరోజు భేటీ అయింది. అమరావతి సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. గత డిసెంబరులో ఆ యూనివర్శిటీతో ఏపీ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేసే నిమిత్తం రూపొందించిన నివేదికపై ఈరోజు ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు రావడం కార్యచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టడం ఆనందదాయకమని, ఈ కార్యాచరణ ప్రణాళికను వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ అవగాహనా ఒప్పందాన్ని ముఖ్యంగా మూడు అంశాల ప్రాతిపదికగా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. అందులో మొదటిది.. థర్డ్ పార్టీ ఆడిట్ మేనేజ్ మెంట్ విధానానికి సంబంధించి 21 శాఖల్లోని 200 వరకూ ఇండికేటర్స్ పై ఇండిపెండెంట్ ఆడిట్, క్వాలిటీ సపోర్టుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని అన్నారు.
రెండోది.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు ఎంపిక చేసిన మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. బ్యాచ్ కు 30 మంది చొప్పున ఐదారు బ్యాచ్ లు ఉంటాయని, ఒక్కో బ్యాచ్ కు పదిహేను రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మూడోది .. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశానికి సంబంధించి ఎక్కడెక్కడ వీక్ పాయింట్లు ఉన్నయో గుర్తించి వాటిని ఏవిధంగా పటిష్టవంతం చేయాలనే దానిపై కూడా ప్రభుత్వానికి తగిన తోడ్పాటును ఈ యూనివర్సిటీ అందించడం జరుగుతుందని చెప్పారు. కాగా, గత డిసెంబరులో సింగపూర్ పర్యటనకు సీఎస్ వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో థర్డ్ పార్టీ ఆడిటింగ్ మానిటరింగ్ సిస్టమ్,ఇండికేటర్స్ పై ఇండిపెండెంట్ ఆడిట్, క్వాలిటీ సపోర్టు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సివిల్ సర్వీసెస్ తదితర ఉన్నతాధికారులకు మెరుగైన శిక్షణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీక్ పాయింట్లు గుర్తింపు వాటిని పటిష్టం చేయాల్సిన అంశాలపై తోడ్పాటును అందించేందుకు వీలుగా ఆ యూనివర్సిటీతో ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంశాలతో కూడిన ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చు కోవడం జరిగింది.