paripoornananda: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (83) పరమపదించడంపై స్వామి పరిపూర్ణానంద దిగ్భ్రాంతి
- జయేంద్ర సరస్వతి ఈ లోకానికి చేసిన మేలు అనుపమానం
- ఆధ్యాత్మిక తపోలోకంలో ఆయనో ధ్రువతార
- సంస్కరణలను చేసి చూపించి సమాజానికి సందేశం ఇచ్చారు
కొంతకాలంగా శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతోన్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (83) కాంచీపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం పరమపదించిన విషయం తెలిసిందే. ఆయన శివైక్యం చెందడంపై రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి ఈ లోకానికి చేసిన మేలు అనుపమానమని అన్నారు. ఆధ్యాత్మిక తపోలోకంలో ఓ ధ్రువతారగా ఆయన మన అందరికీ తెలుసని అన్నారు.
జయేంద్ర సరస్వతి ఈ సమాజానికి చేసిన సేవ, సంస్కరణలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలిపారు. ఆయన ఎన్నో సంస్కరణలను చేసి చూపించి సమాజానికి సందేశం ఇచ్చారని అన్నారు. ఓ సంఘ సంస్కర్తగా పని చేశారని తెలిపారు. దళితులతో సమావేశాలు ఏర్పాటు చేసి, మంచి సమాజాన్ని స్థాపించడం కోసం కూడా కృషి చేశారని అన్నారు. పూజ్యులు జయేంద్రసరస్వతి శివైక్యం చెందారని అన్నారు.