ANI: ఘోరం... వీధికుక్కల దాడిలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి!
- పొలానికి వెళుతుండగా బాలుడిపై కుక్కల దాడి
- దాడికి తెలియరాని కారణాలు
- ఆంధ్రప్రదేశ్‌లోని అమ్మపల్లి గ్రామంలో ఘటన
వీధికుక్కలు చేసిన దాడిలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి ఉత్తరంగా దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలిజపేటకు సమీపంలోని అమ్మపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలుడు ఆర్ జశ్వంత్‌పై కుక్కలు దాడి చేయడంతో అతను గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బాలుడ్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను ప్రాణాలు విడిచాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు, బంధువుల రోదన స్థానికులను కలచివేసింది.
ఊర్లో పొలానికి వెళుతుండగా కుక్కలు అతనిపై దాడి చేశాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. అతనిపై కుక్కలు ఎందుకు దాడి చేశాయన్నది మాత్రం తెలియలేదని తెలిపింది. చిన్నపిల్లలపై వీధి కుక్కలు, కోతుల దాడులు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. పిల్లలే కాక వృద్ధులు కూడా వీధి కుక్కల దాడితో ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలు.