APJ Abdul Kalam: నేడు నేషనల్ సైన్స్ డే: ప్రపంచాన్ని మార్చిన ఏడుగురు భారత సైంటిస్టులు
- రామన్, ఎస్ చంద్రశేఖర్లకు నోబెల్ బహుమతి
- కలాం, విశ్వేశ్వరయ్యలకు భారతరత్న
- భారత అణు విద్యుత్ పితామహుడుగా బాబా
శాస్త్రీయంగా దేశ పురోగతికి దోహదం చేసిన, చేస్తోన్న మేధావుల గౌరవార్థం ఈ రోజును భారతదేశంలో జాతీయ శాస్త్రీయ దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)గా జరుపుకుంటారు. మనదేశానికి చెందిన ఏడుగురు సైంటిస్టులు ప్రపంచం శాస్త్రీయంగా సాధించిన పురోగతిలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న వారి సేవలు, పొందిన అవార్డుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం....
సర్ సీవీ రామన్...
నవంబరు 7, 1888న తిరుచురాపల్లిలో జన్మించారు. 1930లో తేజో వికిరణత (స్కేటరింగ్ ఆఫ్ లైట్) పై ఆయన చేసిన అపార కృషికి గుర్తుగా నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి ఆసియన్ అలాగే మొట్టమొదటి శ్వేతజాతేతరుడు ఆయనే కావడం గమనార్హం. నవంబరు 21,1970న ఆయన సహజ మరణం పొందారు.
హోమీ జే బాబా...
హోమీ జహంగీర్ బాబా అక్టోబరు 30, 1909న బాంబేలో జన్మించారు. క్వాంటమ్ సిద్ధాంతానికి తన వంతు కృషి చేశారు. భారత అణు ఇంధన కమీషన్ (ఏఈసీఐ)కి మొట్టమొదటి అధ్యక్షుడుగా పనిచేశారు. గ్రేట్ బ్రిటన్‌లో అణు భౌతికశాస్త్రంలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన భారత్‌కు తిరిగొచ్చిన అనంతరం ప్రతిష్ఠాత్మక అణు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అప్పటి ప్రముఖ నాయకులయిన జవహర్ లాల్ నెహ్రూ లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. బాబా ప్రముఖంగా భారత అణు విద్యుత్ పితామహుడుగా సుపరిచితుడు. జనవరి 24, 1966న ఆయన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
విశ్వేశ్వరయ్య...
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత ఇంజనీరుగా, పండితుడుగా, రాజనీతిజ్ఞుడుగా అందరికీ సుపరిచితుడు. ఆయన సెప్టెంబరు 15, 1860న జన్మించారు. 1912-18 మధ్యకాలంలో ఆయన మైసూరు దివాన్‌గా వ్యవహరించారు. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు. ఇంజనీరింగ్ రంగంలో ఇప్పటికీ అద్భుతాలుగా పరిగణించే ఆటోమేటిక్ తూము గేట్లు, బ్లాక్ ఇర్రిగేషన్ సిస్టమ్ లాంటి అన్వేషణల పరంగా ఆయన స్మరణీయులు. ఆయన జయంతిని ఏటా 'ఇంజనీర్స్ డే'గా మనదేశంలో జరుపుకుంటారు. 1895లో ఆయన కనిపెట్టిన 'కలెక్టర్ వెల్స్' వ్యవస్థ నేటికీ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.
ఎస్ చంద్రశేఖర్...
అక్టోబరు 19, 1910న లాహోర్‌లో జన్మించారు. 1983లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. కృష్ణబిలాలపై గణితశాస్త్ర సంబంధ సిద్ధాంతాన్ని ఆవిష్కరించినందుకు గాను భౌతికశాస్త్రంలో ఆయనకు ఈ గుర్తింపు లభించింది. ఆయన పేరుపై 'చంద్రశేఖర్ లిమిట్' అనే ప్రామాణికం కూడా ఆచరణలోకి వచ్చింది. ఆయన సీవీ రామన్‌కు మేనల్లుడు కూడా. తారల నుంచి ప్రత్యేకించి తెలుపు రంగు మరుగుజ్జు తారల నుంచి విడుదలయ్యే రేడియోధార్మిక శక్తికి సంబంధించి ఆయన చేసిన కృషికి బాగా గుర్తింపు వచ్చింది. ఆగస్టు 21, 1995న ఆయన షికాగోలో మరణించారు.
శ్రీనివాస రామానుజన్...
గణితశాస్త్రంలో రామానుజన్ పేరు తెలియని వారుండరు. డిసెంబరు 22, 1887న ఆయన తమిళనాడులో జన్మించారు. అంకెల సిద్ధాంతం, గణితశాస్త్ర విశ్లేషణ పరంగా ఆయనకు గుర్తింపు లభించింది. త్రికోణమితిపైనా ఆయన శ్రమించారు. శాకాహారం కొరత కారణంగా ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు ఆయనకు పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. 32 ఏళ్లకే కన్నుమూశారు. రామానుజన్ జయంతిని ఆయన స్వరాష్ట్రం తమిళనాడు ఏటా 'స్టేట్ ఐటీ డే'గా జరుపుకుంటోంది.
జగదీశ్ చంద్రబోస్...
ఆచార్య జగదీశ్ చంద్రబోస్ నవంబరు 30, 1858న పశ్చిమ్ బెంగాల్‌లోని బిక్రంపూర్‌లో జన్మించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనో భౌతికశాస్త్రజ్ఞుడు, జీవశాస్త్రవేత్త, వృక్షశాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్. రేడియో, సూక్ష్మతరంగ శాస్త్రంపై అధ్యయనం చేశారు. మొక్కలపై విస్తృత పరిశోధన
చేశారు. ఆయన్ను బెంగాలీ సైన్స్ ఫిక్షన్ పితామహుడుగా భావిస్తారు. రేడియో తరంగాలను గుర్తించడానికి సెమీకండక్టర్ జంక్షన్లను ఉపయోగించిన తొలి వ్యక్తిగా కూడా జేసీ బోస్ గుర్తింపు పొందారు. ఆయన మొట్టమొదటి సారిగా వైర్ లెస్ కమ్యూనికేషన్‌ను ఆవిష్కరించి ఔరా అనిపించుకున్నారు.
ఏపీజే అబ్దుల్ కలాం...
అక్టోబరు 15, 1931న జన్మించారు. డీఆర్‌డీఓలో ఆయన ఎయిరోస్పేస్ ఇంజనీరుగా పనిచేశారు. ఇస్రోకి కూడా సేవలందించారు. భారత్ మొట్టమొదటిసారిగా విజయవంతంగా ప్రయోగించిన స్వదేశీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎల్‌వీ-3) ప్రాజెక్టుకు ఆయన డైరెక్టరుగా వ్యవహరించారు. భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. 2020 నాటికి దేశాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను 'ఇండియా 2020' అనే పుస్తకంలో ఆయన సూచించారు. ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును అందుకున్నారు. జులై 25, 2015న 83 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించారు.